Sunday, November 23, 2014

ఒక రాజకీయ ఉత్తరం


ఒక రాజకీయ ఉత్తరం
రచన: మహెజబీన్

(మహె జబీన్‌ గారి కవితలు “ఆకురాలు కాలం” సంకలనంగానూ, ఆ తర్వాత వివిధ పత్రికల్లోనూ వెలువడి ఎంతగానో ప్రశంసించ బడ్డాయి. మహె జబీన్‌ కవయిత్రి గానే కాకుండా సాంఘిక సంక్షేమ కార్యకర్తగా కూడా ఎంతో దీక్షతో పనిచేస్తున్నారు.)

నేనేం చేయను బాలగోపాల్‌
నా కొడుకు మాట వినడం లేదు
బ్రతికే ప్రాధమిక హక్కుపై
వాడికి పెద్ద మమకారం లేదు గాని
మాట్లాడుతూ బ్రతికే మనిషి
గాయపడటం భరించలేక పోతున్నాడు
“మనకు పౌరసత్వం లేదు
పౌరహక్కులు లేవు
ఎలాగో ఒకలా బతికేద్దాం
కుక్కలు పందులతో పాటు మైనారిటీలురా” అన్నాను
“మాట్లాడకురా ఉద్యమం మాటెత్తకురా
మానవహక్కులు మరిచిపోరా”
ఎంతెంతో చెప్పాను
ఎన్నోసార్లు చెప్పాను
“మాట్లాడితే నడిరోడ్డు మీద నరికేస్తారురా”
భయపెట్టాను
“ఒక్కగానొక్క కొడుకువిరా”
sentiment తో ప్రయత్నించాను
కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను
నవమాసాలు మోసిన సంగతి
తొమ్మిదిసార్లు గుర్తుచేసాను
వింటేగా
మాట్లాడటానికి ఎన్నిలేవు ప్రపంచంలో
రాజకీయాలు కుంభకోణాలు సినిమాలు
ఎన్నికలు వాగ్దానాలు కంప్యూటర్లు
చివరికి telephone sex talks
ఇవన్నీ వదిలేసి
పౌరహక్కులు అంటాడేంటి
వీడికి పిచ్చిగాని పట్టిందా
ఇదంతా నీవల్లే జరిగింది  బాలగోపాల్‌
నీరాతలు మాటలతో వాడిలా అయ్యాడు
అక్కడ రాలిపడ్డ రక్తపు చుక్కలు
లెక్కపెట్టుకు రమ్మంటున్నాడు
నేనేం చేయను వాణ్ణి వదులుకోలేను
నా కొడుకు ఎంచుకున్న దారే నాదారి

Saturday, November 22, 2014

నలుగురం కలిసిన వేళ

నలుగురం కలిసిన వేళ

దూరం నించి స్నేహనయనాలతో చిరునవ్వుల్తో
ఆరోగ్యంగా మీరు నడిచివస్తారు
మన చేతులు మృదుగాఢంగా పలకరించుకుంటాయి
అందరం టీపాయ్ చుట్టూనో చాప మీదో
బయట పచ్చిక పైనో విశ్రాంతి భంగిమల మవుతాం
మా పాప పరిగెత్తుకొచ్చి మీ ఒళ్ళో వాలుతుంది
సాయంత్రం చల్లని గాలిలా వీస్తుంటుంది
గూళ్ళు పక్షుల్ని పిలుస్తుంటాయి

మనలో ఒకళ్ళు రాత్రి సినిమా గురించో
కురవక కురిసిన వాన గురించో ప్రస్తావన చేస్తారు
అంతలో మరొకళ్ళు సగం చదివిన లిటిల్ ప్రిన్స్ మీద
సందేహాలు రేపుతారు
ఎంతకీ తెగని చిక్కుముళ్ళవుతాయి చర్చలు
ఇంట్లోంచి టీ వస్తుంది
టీ పొగల మధ్య మిత్రుడి గొంతు విప్పుకొని
ఒక కవిత వానకాలవలా జాలువారుతుంది
మనలో ప్రాణతరంగాలు చెలరేగుతాయి
మెరిసే కళ్ళతో పాప మన వంకే
మార్చి మార్చి చూస్తుంటుంది
ఆ పైన - మనుషుల డబ్బు వాసనో మత శిలోన్మాదమో
దేశమాత గాయాలో వాదానికొస్తాయి
మాటలు ముక్కుల్తో పరస్పరం రాసుకుంటాయి
ఘర్షించి ఘర్షించి మనం
జీవనలయని గట్టిపరుచుకుంటాం
ప్రస్తావన మారిపోయి
ఈసారి మనం పియానో మెట్లమీదగా
బీథోవెన్ ఐదో సింఫొనీలోకి
ఒక పులకరింతతో ప్రయాణిస్తాం
హృదయాలు పిట్టలై ప్రపంచమంతా తిరిగొస్తాయి
సాయంత్రం చీకటిగా చిక్కపడుతుంది
మనలో అదృశ్యదీపాలు వెలుగుతాయి

నలుగురం కలిసిన వేళ
మనం మరొకళ్ళలోకీ మరొకళ్ళు మనలోకీ
ప్రవహించటం ఎంత బావుంటుంది
*** *** ***

"ఒక సారాంశం కోసం" కవితా సంపుటినించి
కవి .. పాపినేని శివశంకర్
1990 లో ముద్రితం

జుగల్‌ బందీ

అందంగా, అర్థవంతంగా కవిత్వం రాయడమంటే....

జుగల్‌ బందీ (ఘంటసాల నిర్మల) 


రాత్రి దీపం రహిస్తుంది 
మసక చీకటి మంత్రభస్మమై కలల పొగలు పొటమరిస్తాయి 
ఏకంతధ్వాంతాన మొహమాటాల మొగ్గలు విప్పారి 
స్వాగత సౌరభాలు ఎరుపుకొసల అగరుతీగలౌతాయి 
పగలంతా సమస్యల పచ్చి గాయాలు రేగి దిగులు స్రవించిన కళ్ళు 
నిశాలేపనం పులుముకుని లేవెన్నెల బయళ్ళవుతాయి 
దైనిక మర్యాదల నిర్జల ధారలలో 
తడిసి మోపెడైన సభ్యతావస్త్రాలు విదిల్చి 
వాంఛాస్నానానికి ఉద్యమించి 
ఆత్మలు రెండు 
నిలువెత్తు నిస్సిగ్గుకి నిర్వచనభంగిమలౌతాయి 
............. 
దేహం మహతిపై స్పర్శాపవనాలు తరగలెత్తి 
మగత నవ్వుల నిక్వాణాలతో మోహం మేఘమల్హారమౌతుంది 
చీకటి నదిలో అనాది కాంక్షాకిరణం సోకి 
విప్పారిన ఇరుకల్హారాలు పరవశాల పరిమళాలు పైకెగరేస్తాయి 
వాంఛోధృతికి వణికిపడే ఒళ్ళూ 
రహస్యాల్ని వడికే వేళ్ళూ 
ఎప్పటికీ తెగని చిక్కుముడిని విప్పేందుకు పలకాబలపాలవుతాయి 
ఊరువులూ నిట్టూరుపులూ 
మానసాన్ని మాధుర్యమండలానికి మోసుకెళ్ళే పూలతాళ్ళవుతాయి 
పరస్పర గాత్రసహకారంతో 
జుగల్‌ బందీ తారాస్థాయిని చేరుతుంది 
నెత్తురంతా నిషా పొంగి 
అగాధ రహస్యాలు చెరిసగమై ఆవిష్కరించాక 
చెమరించిన నొసట తృప్తి వజ్రం తళుకుమంటుంది 
.......... 
డోలిక ఆగక తప్పదు 
ఇంతా జరిగి పోయాక హాయి వూయల ఆగక తప్పదు 
చాలీ చాలని సుఖం దుప్పటి బాహ్యాంతర నగ్నతను పూర్తిగా కప్పదు 
హఠాత్తుగా పూచిన పరిమళాలు అంతలోనే ఆవిరవుతాయి 
ఒడుపు తెలీక చేజార్చిన కలల పట్టు దారాల కోసం 
కళ్ళు వెక్కిళ్ళు పెడతాయి 
రూపాల్నీ లోపాలనీ సుతారం చేసి చూపిన 
వెన్నెల వెండి అద్దం వెల వెల పోతుంది 
యదార్థాల యాంటీక్లయిమాక్సు ఎప్పటిలా ఎదురొస్తుంది 
సమస్యలు రేగిన వ్రణాల్లా సలపరిస్తాయి 
నిజాలు నిప్పుకణాల్లాగే నిగారిస్తాయి 
ప్రశ్నల పునర్జ్వలనంతో అంతరాత్మల కమురుకంపుకు 
అగరు కొసన వేలాడే బూడిద తీగ ఆఖరి ప్రేక్షక నేత్రమౌతుంది 
క్షణం క్రితం గర్వపడ్డ హృదయం గాయమై పగులుతుంది 
మాధుర్య మాణిక్యమై భాసించింది మట్టిముద్దయి మిగులుతుంది 
నల్లని చల్లని రాత్రి గచ్చు మీద 
తొలికిరణం తురాయి ముల్లయి గుచ్చుతుంది 

ఆకురాలు కాలం -మెహజబీన్


ఆకురాలు కాలం 

                             -మెహజబీన్ 

అతనెప్పుడూ  అంతే 
ఒంటరిగా  రమ్మంటే  వసంతాన్ని  వెంట  తెస్తాడు

ఆరుబయట  ఆకుల  నిశ్శబ్దంలో  
చెట్లు  కవాతు  చేస్తున్నాయి
ఆ  సెలయేటి  నీళ్ళల్లో
ఆకాశ  చిత్రం  ఘనీభవించింది  
చుక్కలు  కరిగి  రాలుతున్న  దృశ్యం
లీలగా  గుర్తుంది

వద్దు ...
నాకు  వెన్నెలా  వద్దు, పున్నమీ  వద్దు
సూర్యుడొక్కడు  చాలు

అతని  నిరీక్షణ లో  ఈ  నల్లని  రాత్రి  అలా 
గడవనీ ...

అతనెప్పుడూ అంతే
వస్తూ  వస్తూ పాటల్ని  వెంట తెస్తాడు

అతని సమక్షంలో  
పోగొట్టుకున్న  బాల్యం  తిరిగి  ప్రవహిస్తుంది
శరీరం  అనుభవాల పాఠశాల అవుతుంది 
నేను  అతని గుండెల్లో దాక్కుని  పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా  నన్ను  లేపి
మంజీరనాదాల్ని తూటాలు  
వెంటాడిన  వైనం 
చెబుతాడు
అప్పుడు భయంగా  అతన్ని  
నా గుండెలోనే  దాచుకుంటాను

అతనిప్పుడు  లేదు
ఈ మధ్య  అర్ధాంతరంగా  వచ్చిన
ఆకురాలే  కాలానికి  ఎక్కడ  రాలిపడ్డాడో  ? 

రెండు కవితలు

రెండు కవితలు

నాకు నచ్చిన రెండు కవితలు పోస్ట్ చేస్తున్నాను. (అంటే నచ్చిన కవితలు ఇవి మాత్రమే అని కాదు. ) కాపీ రైట్లు ఆయా రచయిత(త్రు)లకు చెందుతాయి.

తలుపు - ఇస్మాయిల్

నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరుచుకుని
వెళ్ళిపోయావు నీవు

నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.

ఆకురాలు కాలం - మహెజబీన్

అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంట తెస్తాడు

ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో
చెట్లు కవాతు చేస్తున్నాయి
ఆ సెలయేటి నీళ్ళల్లో
ఆకాశ చిత్రం ఘనీభవించింది
చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం
లీలగా గుర్తుంది

వద్దు...
నాకు వెన్నెలా వద్దు, పున్నమీ వద్దు
సూర్యుడొక్కడు చాలు

అతని నిరీక్షణలో ఈ నల్లని రాత్రి అలా గడవనీ...

అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ పాటల్ని వెంట తెస్తాడు

అతని సమక్షంలో
పోగొట్టుకున్న బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
శరీరం అనుభవాల పాఠశాల అవుతుంది
నేను అతని గుండెల్లో దాక్కుని పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి
మంజీరనాదాల్ని తూటాలు వెంటాడిన వైనం చెబుతాడు
అప్పుడు
భయంగా అతన్ని నా గుండెలో దాచుకుంటాను

అతనిప్పుడు లేడు
ఈ మధ్య అర్ధాంతరంగా వచ్చిన
ఆకు రాలే కాలానికి ఎక్కడ రాలి పడ్డాడో?